హెచ్‌1బీ వీసాదారులకు కెనడా శుభవార్త

Indians to benefit as US H1-B visa holders can now work and live in Canada

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారికి కెనడా శుభవార్త చెప్పింది. హెచ్‌1బీ వీసాదారులు తమ దేశంలో ఉద్యోగం చేసుకోవచ్చని ఈ మేరకు ప్రకటించింది. నిపుణులైన ఉద్యోగులను ఆకర్షించేందుకు కెనడా ఈ పథకాన్ని ప్రారంభించింది. అమెరికాలో హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్నవారిలో 75 శాతం మంది భారతీయులే. ఈ నేపథ్యంలో కెనడా ప్రకటన భారతీయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ కొత్త పథకం ద్వారా కెనడా 10 వేల దరఖాస్తులను స్వీకరిస్తుంది. హెచ్‌1బీ వీసాదారులు మూడేండ్లపాటు తమ దేశంలో పనిచేసేందుకు అనుమతించనుంది. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా కెనడాలో నివసించేందుకు, విద్యనభ్యసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. హెచ్‌1బీ అనేది నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఈ వీసా వీలు కల్పిస్తుంది. హెచ్‌1బీ వీసాదారుల్లో భారత్‌, చైనాకు చెందిన వారే అత్యధికం.