అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు

బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో బియ్యం కోసం భారతీయులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. భవిష్యత్తులో బియ్యానికి కటకట తప్పదన్న భయంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. సూపర్ మార్కెట్ల వద్ద భారతీయులు సోనా మసూరీ బియ్యం కోసం క్యూకట్టిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది. ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో పలు రకాల నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి.

ఈక్రమంలో బియ్యం కొరత వార్తలు రావటంతో అన్ని సూపర్ మార్కెట్లలోను బియ్యం ప్యాకెట్స్ క్షణాల్లో ఖాళీ అవతున్నాయి. గతంలో ఒక రైస్ బ్యాగ్ 22 డాలర్లు ఉంటే… ఇప్పుడు 32-47 డాలర్ల వరకు అమ్ముతున్నారని చెబుతున్నారు. కొన్ని స్టోర్లలో ఒకరికి ఒకటే బ్యాగ్ అమ్ముతుండగా… మరికొన్ని స్టోర్ లలో లిమిట్ పెట్టట్లేదు. అంతేకాదు.. ఒక్కక్కరికి 5 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు నిర్వాహకులు. గతంలో బ్రాండ్ చూసి కొనేవారు..ఇప్పుడలా కాదు బ్రాండ్ పేరు ఏదైనా బియ్యం ప్యాకెట్ కనిపిస్తే చాలు కొనేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితిని అమెరికా సూపర్ మార్కెట్స్ చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. ధర పెంచేసి మరీ అమ్మేస్తున్నారు. దీంతో ధర ఎక్కువైనా బియ్యం దొరికితే చాలు అన్నట్లుగా అధిక ధరలు ఇచ్చి కొనేస్తున్నారు.