అట్టహాసంగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ప్రధాని మోడీ సత్కరించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు.ఈ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు,వేద పండితులు పాల్గొన్నారు.

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీకి పూజారులు సెంగోల్ ఇచ్చారు. అనంతరం ఆ సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ను ప్రతిష్టించారు. ప్రత్యేక పూజతో వేడుక ప్రారంభమైంది. సుమారు గంటపాటు ఈ పూజా కార్యక్రమాలు సాగాయి.