ఒంటి చేత్తో టీం ఇండియా ను గెలిపించిన సిరాజ్

మహ్మద్‌ సిరాజ్ ఇప్పుడు ఈ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ ఒంటి చేత్తో టీం ఇండియా ను గెలిపించాడు. ఆసియా కప్-2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు శ్రీలంక వేదికగా జరిగింది.

ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌లో బుమ్రా.. కుశాల్ పెరీరాను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హైదరాబాదీ సిరాజ్ మీయా హవా మొదలైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 4 వికెట్లు తీశాడు సిరాజ్. బంతి పడటమే ఆలస్యం వికెట్ వస్తుందా అనేంతలా సిరాజ్ బౌలింగ్ సాగింది. దీంతో 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (23; 18 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్‌ కోల్పోకుండా భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు.

రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌కిది రెండో టైటిల్. 2018లోనూ (బంగ్లాదేశ్‌తో ఫైనల్‌) హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఆసియా కప్‌ సాధించింది. భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ సిరాజ్‌. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు. వన్డే ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సాధించింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంకనే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.