శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

78 పరుగుల తేడాతో గెలుపు

india team
india team

పుణే: శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ట్వంటీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లి సేన 20తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 15.5 ఓవర్లలో కేవలం 123 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగి పోయారు. తొలుత ఓపెనర్ దనుష్క గుణతిలక (1)ను బుమ్రా వెనక్కి పంపా డు. ఆ వెంటనే మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (9)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ పెరీరా (7)ను నవ్‌దీప్ సైని ఔట్ చేశాడు. దీంతో లంక 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చెలరేగి ఆడిన మాథ్యూస్ మూడు సిక్సర్లు, ఫోర్‌తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ 36 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 57 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 123 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సైని మూడు, శార్దూల్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/