ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం

భార‌తీయుల కోసం ప్ర‌త్యేక విమానాలు..విమాన ఛార్జీల‌ను భరించనున్నకేంద్రం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. భార‌తీయుల కోసం ప్ర‌త్యేక విమానాలు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. విమాన ఛార్జీల‌ను కేంద్ర‌మే భ‌రించనున్న‌ట్లు తెలిపింది. రాత్రికి ఉక్రెయిన్ స‌మీప దేశాల నుంచి 2 విమానాలు బ‌య‌ల్దేర‌నున్నాయి. రుమేనియా మీదుగా విమ‌నాలు రానున్నాయి. ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో.. ఉక్రెయిన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం మ‌ళ్లీ ఢిల్లీకి నిన్న తిరిగొచ్చిన విష‌యం తెలిసిందే.

భార‌తీయ అధికారుల బృందాల‌ను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు పంపి.. అక్క‌డ్నుంచి విద్యార్థుల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్నారు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు విద్యార్థుల ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సుమారు 16 వేల మంది ఇండియ‌న్స్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. స్వ‌దేశానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్య‌త త‌మ‌ద‌ని ఇండియ‌న్స్‌కు కేంద్రం హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి భార‌తీయులు బ‌య‌ట‌ప‌డేందుకు కేంద్రం సుర‌క్షిత‌మైన దారుల‌ను గుర్తించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయుల‌ను క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు స‌హ‌క‌రించాల‌ని పుతిన్‌ను మోడీ కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/