కెనడాలో వీసా సేవలను నిరవధికంగా నిలిపివేసిన భారత్

సెప్టెంబర్ 21 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ప్రకటన

India suspends visa services in Canada citing ‘operational reasons’

న్యూఢిల్లీః భారత్ కెనడాకు ఊహించని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని భారత్ నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ రేపిన చిచ్చు మరింత తీవ్రతరం దాలుస్తున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కెనడా కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ హెడ్ ను తమ దేశం నుంచి బహిష్కరించడం తెలిసిందే. దీంతో భారత్ సైతం కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

దీనికి కొనసాగింపుగా భారత్ లోని కశ్మీర్లో కిడ్నాప్ లు, అల్లర్లు, అశాంతి, ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే కెనడా పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కెనడా సూచనలు చేసి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కెనడాలో మారిన పరిణామాల నేపథ్యంలో భారత సంతతి వారు తమ భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ భారత్ సైతం సూచనలు జారీ చేసింది. కెనడా వాసులకు వీసా సేవలను నిరవధికంగా నిలిపివేయడంపై భారత్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాకపోతే వీసా సేవలను ఔట్ సోర్స్ రూపంలో అందించే బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ తన కెనడియన్ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించి ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. కెనడాలో వీసా కేంద్రాలను బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. ‘‘భారత మిషన్ నుంచి ముఖ్యమైన సందేశం. నిర్వహణ కారణాల రీత్యా సెప్టెంబర్ 21 నుంచి భారత వీసా సేవలను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయడమైనది’’అని పేర్కొంది. దీనిపై భారత్ కు చెందిన ఓ అధికారి అనధికారికంగా మాట్లాడుతూ.. వీసా సేవల నిలిపివేతను ధ్రువీకరించారు.