కొండెక్కిన ‘ఉల్లి’

ధరలను అదుపు చేయడంలో పాలకుల విఫలం

Increased onion prices
Increased onion prices

రౌతు మెత్తనైతే గుర్రం మూడుకాళ్లతో పరుగెడుతుందంటారు. పాలకుల అసమర్థత, కొందరు అధికారుల అవినీతి, అలక్ష్యం కారణంగా అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలతో నిరుపేదలే కాదు మధ్యతరగతి ప్రజలు కూడా విలవిల్లాడిపోతున్నారు.

ఏడాదికేడాదికే కాదు నెలనెలకే కాదు నిన్న ఉన్న ధర నేడు ఉండటం లేదు. నేడు ఉన్న ధర రేపటికి అందుకోకుండా పెరిగిపోతున్నది.

కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర వస్తువులను సైతం గుప్పిట్ల్లోపెట్టుకొని కొందరు దళారులు ధరల మాయాజాలం చేస్తున్నారు.

నిత్యావసర వస్తువ్ఞలే కాదు మానవ జీవనానికి అవసరమైన వైద్యం,విద్య, సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతున్నది.కార్పొరేట్‌ వైద్యాన్ని అందలంఎక్కించే ప్రయత్నంలో ప్రభుత్వ వైద్యాన్ని పతనావస్థకు తీసుకు వెళ్తున్నారు.

వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం వైద్య రంగానికి కేటాయిస్తున్నట్లు పాలకులు చెప్పుకుంటున్నా అందులో మందులకు కేటాయిస్తున్నది అత్యంత తక్కువ శాతం.

అన్నింటికంటే ముఖ్యంగా ఒకపక్క కరోనా,ఇంకొక పక్క వదిలిపెట్టని వర్షాలతో అతలాకుతలం అవుతున్న సామాన్యులకు పెరిగిపోతున్న ధరలు నరకం చూపెడుతు న్నాయి.

తాజాగా ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని అంటుకున్నా యి. గతవారంలో నలభై,యాభై రూపాయలకు కిలో ఉల్లిగడ్డలు దొరుకుతుండగా, నిన్న,మొన్నటివరకు 60కి పెరిగింది. మంగళవారం 84కు చేరుకొని నేడు వంద రూపాయలు దాటిపోతున్నది.

దక్షిణాదిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏర్పడ్డ వరదల కారణంగా రవాణాకు అంతరాయం కలిగి మార్కెట్‌కు పంట రావడం లేదని వ్యాపారులు చెప్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు వారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు, వరదలు ఉల్లిగడ్డపంటను ముంచివేశాయి. అధిక శాతం పంట కుళ్లిపోయిందని రైతులు ఆందోళన చెందు తున్నారు.

తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇరవైరెండు హెక్టార్ల వరకు ఉల్లిసాగు చేసినా ఆశించిన మేరకు పంటలు రాలేదు. ఇక రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఉల్లి సాగు చేసిన భూముల నుండి నీరు బయటకు పంపే అవకాశం లేకపోవడంతో పొలంలోనే కుళ్లిపోతున్నాయి.

కూలీల ఖర్చు కూడా బాగా పెరగడంతో వ్యయం వృధా అవ్ఞతుందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవచ్చునని అధిక శాతం రైతులు పంటను తవ్వకుండానే భూమిలోనే వదిలేశారు.

మరికొందరు దున్నేస్తున్నారు. ఉల్లిపంట సాగు చేయాలంటే ఎకరాకు అరవై, డైబ్భెవేలు ఖర్చుఅవ్ఞతుంది. ప్రకృతి చేసిన బీభత్సంతో పంట దెబ్బతినడంతో రైతుల పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.

పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఉల్లిసాగు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచంలో 140 దేశాల రైతులు ఉల్లిపంటను సాగు చేస్తున్నారు.

అయినా దిగుబడుల్లో సగం వాటా చైనా, భారత్‌లదే. ప్రపంచంలోనే ఐదోవంతు పంట పండించే భారత్‌లో ఇప్పుడు కిలోఉల్లి ధర వంద రూపాయలు దాటిందంటే అర్థం చేసుకోవచ్చు.

కానీ దిగుబడుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌ ఉత్పాదకతలో 90వస్థానంలో ఉండటం దురదృష్టకరం.

ఈ విషయంలో ఐర్లాండ్‌ దాదాపు అరవై ఏడు టన్నులకుపైగా దిగుబడులతో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంటే భారత్‌ పదిహేను టన్నులలోపే సాధించ డానికి కట్టుబడుతున్నది.

దేశ జనాభాకు అవసరమైన ఉల్లిని పండించడంలో వెనుకబడే ఉన్నాం.

దేశంలో ప్రస్తుతం తలసరి వార్షిక వినియోగం 6.7 కిలోలని ‘జాతీయ ఉల్లి అల్లం పరిశోధన సంస్థ (డీఓజీఆర్‌) వెల్ల డించింది.

దేశ జనాభా 2050 నాటికి 170 కోట్లకుపైగా చేరుకుంటుందని అప్పటి తలసరి ఉల్లివినియోగందాదాపు పన్నెండు కిలోలకు చేరుకుంటుందని పలువురు వ్యవసాయ నిపుణులే అంచనా వేశారు.

కానీ పంట విస్తీర్ణం అందుకు అనుగుణంగా పెరిగే అవకాశాలు కన్పించడం లేదు. అధి కారిక లెక్కల ప్రకారమే అప్పటికి దేశ అవసరాలు తీరా లంటే దాదాపు ఏటా మూడు కోట్ల టన్నుల ఉల్లిపాయలు మన రైతులు పండించాలి.

ఉత్పాదకత 21 టన్నులకు చేరుకోవాలి. కానీ ఆ దిశలో అడుగులు పడటం లేదు. ఐరోపా, అమెరికా లాంటి దేశాల్లో వచ్చినంత ఉత్పాదకత కూడా మనదేశంలో రావడం లేదు.

అక్కడ దీర్ఘకాలం సాగు చేసే సంకరజాతి హైబ్రిడ్‌ వంగడాలు తక్కువ ధరలకే లభిస్తున్నాయి.దీనికితోడు అత్యాధునిక యంత్రాల వినియోగంతో పండించడం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గ డమే కాక కోత అనంతరం నష్టాలు కూడా తగ్గిపోతున్నా యి.

భారత్‌లో పురాతన సంప్రదాయ పద్ధతుల్లో తక్కువ కాల వ్యవధిలో గల వంగడాలను సాగు చేస్తున్నారు. ఫలితంగా దిగుబడులు తగ్గుతున్నాయి.

మహారాష్ట్ర,ఆంధ్ర ప్రదేశ్‌,కర్ణాటక ఉల్లిపండించే ప్రధానరాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలోనే 80 శాతం మేర దిగుబడులున్నాయి.

ఉల్లి నిల్వలకు అవసరమైన గోదాముల సౌకర్యం లేకపోవడం పెద్ద లోపం.ఇక మార్కెట్‌ పరిస్థితి పరిశీలిస్తే మహారాష్ట్ర లోని లాసవ్‌గావ్‌ దేశంలోనే ఉల్లిపాయలకు టోకుకు అతిపెద్ద మార్కెట్‌.అక్కడనే దాదాపు ఉల్లి ధరలునిర్ణయం జరుగుతున్నది.

కొందరు దళారులు మాయాజాలంతో కొరత ఏర్పడుతుందనే వాదనను కూడా తోసిపుచ్చలేం. కొరతను ముందుగానే గుర్తించి పెద్దఎత్తున నిల్వలు చేసుకుంటున్నారు.

రైతుల వద్ద మార్కెట్‌లో ఉల్లి నిల్వలు తరిగిపోయిన తర్వాత తమవద్ద ఉన్న స్టాక్‌ను మార్కెట్లోకి తెచ్చుకుంటూ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు.

దీనిని అదుపు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నల్లవ్యాపారులపై పిడిచట్టం ప్రయోగిస్తాం, ఉక్కుపాదంతో అణచివేస్తాం అని మాటలు కాదు కావలసింది చేతల్లో చూపాలి.

రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాల్సిన సమయమిది.

అలాగే పెరుగుతున్న ప్రజావసరాలకు అనుగుణంగా ఉల్లిసాగును ఆధునిక పరిజ్ఞ్ఞానం, సబ్సిడీలతో రైతులను ప్రోత్సహించాలి.

దామెర్ల సాయిబాబ , ఎడిటర్, హైదరాబాద్

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/