ఆదివాసీలకు ఈ బాధలు తప్పేదెప్పుడు?

ఇన్‌ఫార్మర్ల పేర హతమార్చడం అనాగరికత

Aborigines difficulties
Aborigines difficulties-file

లోకం డిజిటల్‌ మయమవుతోంది. ఎలక్ట్రిక్‌ కార్లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయం లేనిదే అడుగు ముందుకుపడని ఈ పరిస్థితుల్లో, రోబోల సాయంతో ఉత్పత్తి జరుగుతున్న తరుణం..

టెలికమ్యూనికేషన్‌ రంగంలో మావోయిస్టులు ఎన్నడూ ఊహించని ‘విప్లవం 5జి తీసుకొస్తున్నవేళ..

అంతరిక్షంలోకి మానవుడు వెళుతున్న సమయాన, అంగారక గ్రహం, చంద్రగ్రహంపై కాలనీల నిర్మాణ విషయం పెద్ద చర్చనీయమవుతున్న ఈ సంధి సమయంలో మావోయిస్టుల ఈ సాయుధ పోరాట, ఆరాటానికి ఏ మాత్రం అర్థం లేదు.

క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులను సైతం పసిగట్టకుండా ఇంకా దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ప్రజాసైన్యం, లాంగ్‌మార్చ్‌ అని కలలుకంటూ ఇలా ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర హతమార్చడం ఎంతటి అనాగరికత? ఈ విధానాన్ని ఏ రాజకీయ చైతన్యం గలవారు ఆమోదిస్తారు?

నియంతృత్వానికి నిలువెత్తు పాతరవేసి ప్రజాస్వామిక విధానాలలో ప్రపంచం ముందుకు కదులుతున్న వర్తమాన సమాజంలో ఏ మాత్రం అభినందనీయం కాని ఇలాంటి చర్యలకు మావోలు ఎప్పుడు చరమగీతం పాడుతారో? ఆదివాసీలకు మావోల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో?

కొ విడ్‌-19 కారణంగా దేశంలో లక్ష మందికిపైగా ప్రజలు మరణించారు. గత ఆరేడు నెలలుగా ఈ మహమ్మారి ‘కరోనా జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. దీని నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నా యి. ముందస్తు జాగ్రత్తలు ఎన్ని పాటించినా జరిగే నష్టం జరుగు తూనే ఉంది.

ఈ క్లిష్ట సమయంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అమాయక ఆదివాసీలను ‘ఇన్‌ఫార్మర్ల పేర అదే పనిగా హతమార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్కో రోజు ముగ్గురు, నలుగురిని ఇన్‌ఫార్మర్ల పేర కాల్చి చంపారు.

తాజాగా జగ్దల్‌పూర్‌ జిల్లా నాగర్‌నార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గుమల్‌వాడ గ్రామా నికి చెందిన బుద్రునాగ్‌ అనే ఆదివాసీని మావోయిస్టులు మట్టు బెట్టారు. గ్రామస్తుల సమక్షంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

అంతకుముందు బీజాపూర్‌ జిల్లాలో 16 మంది ఆదివాసీలను ఇన్‌ ఫార్మర్ల పేర మావోలు హతమార్చారని ఓ ప్రముఖ పత్రిక పేర్కొ న్నది.

30 గ్రామాలకు చెందిన యువకులను అపహరించి, వారిని ఓ చోట చేర్చి అనుమానమున్న వారిని కాల్చిచంపారనితెలుస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడేముందు సమీపంలోని చింతవాగులో పడవ ప్రయాణాలు జరగకుండా, ఇతరులెవరూ అటువైపు రాకుండా సాయుధ గస్తీ ఏర్పాటు చేసి ఈ దారుణానికి పాల్పడ్డారని భావి స్తున్నారు.

ఇలా పత్రికల్లో తరచూ ఇన్‌ఫార్మర్ల పేర మావోల హత్యల విషయం బయటి ప్రపంచానికి తెలుస్తున్నా మావోయిస్టు ల్లో ఏమాత్రం అపరాధభావం, వెరపు, పశ్చాత్తాపం లేకుండా నిర్లజ్జగా నరమేధం కొనసాగిస్తున్నారు. తాజాగా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసీ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఒక కరపత్రం వెలువడింది.

అందులో గత కొన్ని సంవత్సరాల్లో వెయ్యి మందికిపైగా అమాయక ఆదివాసీలను మావోయిస్టులు కనికరం లేకుండా కాల్చిచంపారని, ఆ కుటుంబాలను, పిల్లలను ఇప్పుడు ఎవరు ఆదుకుంటారని అందులో ప్రశ్నించారు.

విచిత్రమే మిటంటే మావోయిస్టు పార్టీ మధ్యస్థాయి నాయకత్వం పార్టీలో పై స్థాయి నాయకత్వానికి ఎగబాకేందుకు ఈ విధమైన హత్యలకు పాల్పడుతున్నారని కూడా అందులో పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని పామేడు, బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో ఇటీవల 35 మంది అమాయక ఆదివాసీలను హతమార్చారని,మధ్యస్థాయి నాయకత్వం తమ ‘ప్రతాపం ఏమిటో పై కమిటీకి తెలిపేందుకు ఈ హత్యలకు పూనుకుంటోందని ఆ పార్టీలోని ఎసిఎం, ఎసిఎస్‌, డివిసి స్థాయి గలవారు తమ ఉనికి చాటుకోవడానికి బలం ప్రకటించుకోవడానికి అమాయక ఆదివాసీలను అన్యాయంగా హతమార్చారని అందులో వాపోయారు.

ముఖ్యంగా బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారిందని, ఆదివాసీల చేతనే ఆదివాసీలను అంత మొందిస్తున్నారని, కూలి-నాలి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా వదలకుండా అమాయకులను హతమారుస్తున్నారని ఆ కరపత్రం తెలియచేస్తోంది.

ఈ హింసాకార్యక్రమాలతో మావోలు ఆదివాసీల గ్రామాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని తెలుస్తోంది.

కొన్ని సందర్భాల్లో మావోల బడా నాయకుల ప్రేరణతోనూ ఈ హత్యలు జరుగుతున్నాయని, ఆదివాసీలు వ్యవసాయ పనులు చేసి, అటవీ ఉత్పత్తులు అమ్ముకోగా వచ్చిన సొమ్మును సైతం మావోయిస్టులు బలవంతంగా లాక్కెళుతున్నారని, తిండిగింజలు దోచుకెళుతున్నా రన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజాకోర్టుల పేర అమాయకులను బలి తీసుకుంటున్నారని, విషపు సంస్కృతి ప్రబలుతోందని అందులో పేర్కొన్నారు.

పార్టీలో పలుకుబడి, పై స్థాయి నాయకత్వాన్ని ఆశించిన కొందరు మావోయిస్టులు సొంత పార్టీవారిని కూడా కాల్చి చంపుతున్నారని తెలుస్తోంది. దక్షిణబస్తర్‌ ప్రాంతంలో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగిన విషయాన్ని ఆ కరపత్రంలో గుర్తు చేశారు.

ఇటీవల మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవం సందర్భంగా కూడా ఈ హత్యాకాండ కొనసాగడం వింతగా, విచిత్రంగా ఉంది.

ప్రజల కోసం ప్రజల సాధికారత కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న మావోయిస్టుపార్టీ అమా యకులను, ఆదివాసీలను హత్యచేయడంవల్ల వారుచెప్పుకుంటున్న విధానం నెరవేరుతోందా? దీనికితోడు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, రోడ్డు నిర్మాణంలో ఉన్న వాహనాలను దగ్ధం చేయడం, అక్కడ పనిచేసేవారిని తుపాకులతో బెదిరించడం పరిపాటిగా మారింది.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని పర్వీహాడ్‌ గ్రామంలో రోడ్డు నిర్మాణంలో ఉన్న ప్రొక్లెయిన్‌, టిప్పర్‌, ట్రాక్టర్‌ కాంక్రీట్‌ మిషన్‌ను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఇలాంటి సంఘటనలు ఛత్తీస్‌గఢ్‌లో అసంఖ్యాకంగా జరిగాయి. అంటే అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడమే కదా ఇది!

హింస, హత్యా కాండ, దగ్ధకాండతో ప్రజల్లో బయోత్పాతం సృష్టించి తమ పబ్బం గడుపుకునేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నం నిందనీయం.

మరోపక్క మందుపాతరలు అమర్చుతూ భద్రతా బలగాల ప్రాణాలు తీసేందుకు గాలింపు చర్యల్లో పాల్గొంటున్న వారిని హత్యమార్చేందుకు పూనుకోవడంతో ఆదివాసీల బాధలు, కష్టాలు కనుమరుగవుతాయా? దశాబ్దాలుగా మావోయిస్టుల కార్యాచరణ ఈ పరిధిని దాటి ముందుకు కదలడం లేదు.

అటు ఆదివాసీలను, ఇటు భద్రతాబలగాలను మట్టుబెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి భవ్యమైన సమాజాన్ని నిర్మిస్తారా? అది సాధ్యమా? సమంజసమా? ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఇది ఇంకా విస్తరిస్తూనే ఉంది. నిత్యం ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు తీసుకోవలసిన చర్యలపైనే ప్రజలు ఎక్కువ దృష్టి సారిస్తున్న సమయంలో మావోయిస్టుల కార్యక్రమాలు వారికి ఊరట కల్పించేదిగా ఉండాలి కాని ఇలా అమాయకుల హత్యలు, విధ్వంసం, ఊచకోతలు కొనసాగించడంలో ఏ విధంగానూ మాన్యత కనిపించదు.

అతి త్వరలోనే తమ చేతిలోకి రాజ్యాధికారం రాబోతోందన్న మానసిక స్థితిలో ఇలా దూకుడుతో వ్యవహరించ డం వల్ల ఒరిగేది శూన్యం. మొత్తం సమాజం పరివర్తన దిశగా కదులుతోంది.

ఆర్థికంగా, సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ వాటికనుగుణంగా జీవితాలను మలచుకునే పనిలో ప్రజలుంటే మావోయిస్టులు మాత్రం ఇలా విధ్వంసాలకు నరమేధాలకు పాల్పడితే ఎలా? శాస్త్రసాంకేతిక రంగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

లోకం డిజిటల్‌ మయమవుతోంది. ఎలక్ట్రిక్‌ కార్లు వస్తున్నాయి.

ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయం లేనిదే అడుగు ముందుకుపడని ఈ పరిస్థితుల్లో రోబోల సాయం తో ఉత్పత్తి జరుగుతున్న తరుణంలో, టెలికమ్యూనికేషన్‌ రంగంలో మావోయిస్టులు ఎన్నడూ ఊహించని ‘విప్లవం 5జి తీసుకొస్తున్నవేళ అంతరిక్షంలోకి మానవుడు వెళుతున్న సమ యాన, అంగారక గ్రహం, చంద్రగ్రహంపై కాలనీల నిర్మాణ విషయం పెద్ద చర్చనీయమవుతున్న ఈ సంధి సమయంలో మావోయిస్టుల ఈ సాయుధ పోరాట, ఆరాటానికి ఏ మాత్రం అర్థం లేదు.

క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులను సైతం పసిగట్టకుండా ఇంకా దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ప్రజాసైన్యం, లాంగ్‌ మార్చ్‌ అని కలలుకంటూ ఇలా ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర హతమార్చడం ఎంతటి అనాగరికత?

ఈ విధానాన్ని ఏ రాజకీయ చైతన్యం గలవారు ఆమోది స్తారు? నియంతృత్వానికి నిలువెత్తు పాతరవేసి ప్రజాస్వామిక విధానాలలో ప్రపంచం ముందుకు కదులుతున్న వర్తమాన సమాజంలో ఏ మాత్రం అభినందనీయం కాని ఇలాంటి చర్యలకు మావోలు ఎప్పుడు చరమగీతం పాడుతారో? ఆదివాసీలకు మావోల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో?

  • ఉప్పల నరసింహం, సీనియర్‌ జర్నలిస్టు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/