ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ కి మ‌రో జ‌ల‌క్

income-tax-department-issues-demand-notice-of-rs-1700-crore-to-congress

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ కి మ‌రో జ‌ల‌క్ త‌గిలింది. ఆదాయ‌ప‌న్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికావాల్సి ఉన్న‌ది. 2017-18 నుంచి 2020-21 మ‌ధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. మ‌రో వైపు ఆదాయ‌ప‌న్ను శాఖ అసెస్‌మెంట్‌ను పున‌ర్ ప‌రిశీలించాల‌ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

కాగా, తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప​ చేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్‌ పార్టీపైనే కాక, ప్రజాస్వామ్యంపైనా ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.