తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనః ఐఎండీ

అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడి

imd-rain-alert-for-ap-and-telangana

హైదరాబాద్‌ః ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అయినప్పటికీ ఉపరితల ఆవర్తన రూపంలో దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నెల 22 నుంచి 24 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

జులై 25, 26 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు తాజా బులెటిన్ విడుదల చేసింది.