ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని బిజెపి నేతలు చూస్తున్నారు – శ్రావణ్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి..తెలంగాణ సర్కార్ తీరు ఫై , కేసీఆర్ ఫై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ రాసారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయాలనీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని , పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సమకూర్చాలని , నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసారు. ఈ లేఖ ఫై తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ నేత శ్రావణ్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో శ్రవణ్ తో పాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, చలపతి రావు, రాజారామ్ యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ..కిషన్ రెడ్డి తీరు ఎలా ఉందంటే కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీత్త అన్నట్లు ఉందని శ్రవణ్ ఎద్దేవా చేసారు. బిజెపి మత ధోరణితో మణిపూర్ తగలబడిపోతుంది. గత రెండు నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. నడిరోడ్డు ఫై మహిళలను బట్టలువిప్పి ఊరేగిస్తూ..అత్యాచారాలు చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు చూసి యావత్ దేశ ప్రజలంతా బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అంత దారుణాలు జరుగుతుంటే అవేమి సంబంధం లేనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించడం దారుణమన్నారు.

డబుల్ బెడ్ రూమ్ విషయంలో కేసీఆర్ ప్రజలను మోసం చేసాడనే చెప్పి ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ 600 స్క్వీర్ ఫీట్ ఇల్లు , 8 లక్షల ఖర్చు చేసి ఎన్నో ఇల్లు కట్టించారు..కట్టిస్తూనే ఉన్నారు. మరి మీరు ఏంచేశారు..మీ కేంద్ర ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని కిషన్ రెడ్డి ని డిమాండ్ చేసారు. 2018 నుండి 2021 వరకు తెలంగాణ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏ మొఖం పెట్టుకొని ఈరోజు డబుల్ బెడ్ రూమ్ దగ్గరికి వెళ్తావు అని కిషన్ రెడ్డి ని ప్రశ్నించారు.

2014 లో తెలంగాణాలో సాగు విస్తీర్ణం కోటి మూడు లక్షల ఎకరాలు ఉంటె..ఈనాడు రెండు కోట్ల ఇరవై ఎకరాలకు పెరిగింది. ఇది మీ బిజెపి వల్లనో..మోడీ , అమిత్ ల వల్లనో పెరగాలే. కేసీఆర్ వల్ల పెరిగిందన్నారు. పోడుభూముల సమస్య ఫై కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టి, చట్టపరమైన సమస్యలు రావొద్దని పోడుభూముల సమస్య కు ఫుల్ స్టాప్ పెట్టారని, 1 లక్ష 51 వేల 146 మంది గిరిజన బిడ్డలకు పోడుభూముల పట్టాలను అందజేశారని , ఇంకా కేసీఆర్ అందజేస్తూనే ఉంటారని శ్రవణ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం కేసీఆర్ లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడం , వాటిలో కొన్ని భర్తీ చేయడం చేసారు. ఇంకా నోటిఫికేషన్లు వేస్తూనే ఉన్నారని అన్నారు. మరి మీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందని కిషన్ రెడ్డి ని శ్రవణ్ ప్రశ్నించారు. 2014 లో మోడీ ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు..ఆ లెక్కన చూస్తే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి..మరి కల్పించారా..? ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు కదా అని శ్రవణ్..కేంద్రాన్ని ప్రశ్నించారు.

బిజెపి పాలిత ప్రాంతాలలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని కిషన్ రెడ్డి ని శ్రవణ్ డిమాండ్ చేసారు. గుజరాత్ లో 60 నుండి 80 ఏళ్లు ఉన్న వారికీ రూ.750 , 80 ఏళ్లు దాటినా వారికీ రూ.1000 లు ఇస్తున్నారు. అదే తెలంగాణ లో కేసీఆర్ పేదలను , వృద్దాలను , వితంతువులను దృష్టిలో పెట్టుకొని వారికీ పెద్ద కొడుకుల రూ. 2016 , వికలాంగులకు రూ. 4016 ఇస్తున్నారన్నారు. ఇవేమి మీకు కనిపించడం లేదా అని కిషన్ రెడ్డి ని శ్రవణ్ ప్రశ్నించారు. ఈరోజు అవినీతి గురించి మాట్లాడే అర్హత బిజెపి ఉందా అని శ్రవణ్ అన్నారు. పెట్టుబడిదారులకు , బ్యాంకులను మోసం చేసిన నేరస్థులకు మోడీ సర్కార్ కొమ్ముకాస్తుంది ఇది నిజం కదా అని శ్రవణ్ ప్రశ్నించారు.