ముంచుకొస్తున్న ‘మిచౌంగ్‌’ తుఫాన్‌..

ఏపీ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో డిసెంబర్ మూడో తేదీ నాటికి నైరుతి బంగాళా ఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తుఫాన్ కు మాయన్మార్ దేశం సూచించిన ‘మిచౌంగ్ ‘ గా నామకరణంగా చేశారు. తుపాన్ గా మారిన తరువాత వాయువ్య దిశగా తుపాను కదులుతూంది. ఆ తరువాత మిచౌంగ్ తుపాను నాలుగో తేదీన నాటికి చెన్నై – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్టు అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ తుఫాన్‌ ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందన్నారు.