టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

శనివారం రాజ్ కోట్ లో శ్రీలంకతో జరిగిన చివరి మూడో టీ20లో టీమ్ ఇండియా 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ నెగ్గాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇండియా జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి విజయం కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. శ్రీలంకకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లంక జట్టును 137 పరుగులకు ఆలౌట్ చేసింది. 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అద్భుత శతకంతో కదంతొక్కిన సూర్యకుమార్ యాదవ్ (112 రన్స్, 51 బంతుల్లో, 9 సిక్స్‌లు, 7 ఫోర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు.

రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్ గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు సాధించి అచ్చెరువొందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రాన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. ఇక శ్రీలంక బ్యాట్స్ మెన్ లో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. కెప్టెన్ దసున షనక 23, ఓపెనర్ కుశాల్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, చరిత్ అసలంక 19 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 10న గువాహటిలో జరగనుంది.