కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం చేస్తాః రాజాసింగ్

If Kishan Reddy calls, he will campaign in Secunderabad as well: Rajasingh

హైదరాబాద్‌ః తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతోందని… కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బిజెపి 17 లోక్ సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్ నుంచి రాజాసింగ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన జహీరాబాద్ లోక్ సభ నుంచి పోటీ అంశంపై స్పందించారు. పార్టీ పోటీ చేయమని చెబుతోందని… కానీ ఆసక్తి లేదన్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమన్నారు.

తాను హిందూరాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలని భావిస్తున్నానన్నారు. తనకు శాసన సభా పక్ష నేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి.. బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని బిజెపి జాతీయ నాయకత్వం అనుకుంటున్నట్లుగా చెప్పారు.