మరోసారి కెసిఆర్‌ అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారు : కిషన్ రెడ్డి

If KCR comes to power again, he will bring Nizam’s rule: Kishan Reddy

హైదరాబాద్‌ః రాష్ట్ర భవిష్యత్తుపై మేధావులు ఒక్కసారి ఆలోచించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలను మరిచిపోవద్దని చెప్పారు. కెసిఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సమాజమా మేలుకో.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బిఆర్ఎస్​ను సమర్థించినట్లే.. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో వెళ్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పారన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై.. కెసిఆర్ సర్కార్​ తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి విరమించారు. జాతీయ నేత ప్రకాశ్ జావడేకర్.. కిషన్ రెడ్డికి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ గురువు అసదుద్దీన్‌ ఒవైసీ అని అన్నారు. కెసిఆర్ఆర్‌కు ఓటేస్తే ఎమ్‌ఐఎమ్‌ కోసం పనిచేస్తారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం పోరాడిన సంఘాలన్నింటిని కెసిఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్‌సీలోనే ఖాళీలు ఉన్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ని గెలిపిస్తే తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.