తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆమోదం

Governor Tamilisai Approves TSRTC Merger Bill

హైద‌రాబాద్ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా కొనసాగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కెసిఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కెసిఆర్‌ వెలుగులు నింపారు. నెల రోజుల క్రితం జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌డంతో.. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింది.