లోకేశ్ కు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఒక్క పైసా ఎక్కువున్నా భగవంతుడు తనను శిక్షిస్తాడన్న అనిల్

anil-kumar-yadav

అమరావతిః నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్న నారా లోకేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనిల్ అక్రమార్జన విలువ రూ. వెయ్యి కోట్లు అని ఆరోపించారు. సిల్లీ బచ్చాకి సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్… అవినీతిలో ఫుల్ నాలెడ్జ్ అని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సిల్లీ బచ్చాపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ కు అనిల్ సవాల్ విసిరారు.

సిట్ కాకపోతే సీబీఐ విచారణ జరిపించుకోవాలని అనిల్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తాను ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తికంటే ఒక్క పైసా ఎక్కువున్నా తనను భగవంతుడు శిక్షిస్తాడని అన్నారు. ఇస్కాన్ సిటీలో 18.5 ఎకరాలు ఉంటే, అంతా అమ్మేసిన తర్వాత ఇప్పుడు మూడు ముక్కలుగా ఎకరా మాత్రమే ఉందని చెప్పారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలను కూడా అమ్మేశానని తెలిపారు. టేక్కేమిట్టలో ఉన్న స్థలాన్ని కూడా రాజకీయాల కోసం అమ్మేశానని చెప్పారు.

అధికారంలో ఉండి వెయ్యి కోట్లు అక్రమంగా సంపాదించానని చెప్పడానికి లోకేశ్ కు సిగ్గుండాలని అన్నారు. నారా లోకేశ్ చెప్పిన చోటుకు వచ్చి తాను అక్రమార్జనకు పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు కూడా రెడీ అని అన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాద్ కు వెళ్లి దాక్కున్న మాజీ మంత్రి నారాయణకు ఇప్పుడు నెల్లూరుకు రావడానికి సిగ్గుండాలని అన్నారు. విలువలు లేని లోకేశ్ గొప్ప నాయకుడని చెప్పడానికి సిగ్గుపడాలని మండిపడ్డారు.