రోడ్డు ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డ టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్​

టీమ్ ​ఇండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్..రోడ్డు ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును ఓ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్‌తోపాటు అతడి కుమారుడు కూడా కారులోనే ఉన్నాడు. పాండవ్ నగర్ నుంచి తన లాండ్ రోవర్ కార్లో వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసం కాగా.. ప్రవీణ్ కుమార్, అతడి కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రవీణ్ కుమార్ టీమిండియా తరపున 2012లో తన చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, 2008లో కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ గెలుచుకున్న టీంలో ప్రవీణ్ కుమార్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించింది. ప్రవీణ్ కుమార్ బంతితో కీలక పాత్ర పోషించాడు. ప్రవీణ్ 68 వన్డేలు, 6 టెస్టు మ్యాచ్‌లు, 10 టీ20లు ఆడాడు. టీ20ల్లో 8, వన్డేల్లో 77, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. భారత రిచ్ లీగ్ ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ కుమార్.. 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.