ప్రశ్నార్థకంగా INDIA కూటమి భవిష్యత్తు..?

ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో కూటమిలోని ప్రధాన పార్టీలు టీఎంసీ, ఆప్ తాజాగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని ప్రకటించడం సంచలనంగా మారింది. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో సొంతంగానే బరిలోకి దిగుతామని తేల్చడంతో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. మరోవైపు కూటమి మూణ్నాళ్ల ముచ్చటేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌మ‌తా బెన‌ర్జీ లేకుండా కూట‌మిని ఊహించ‌లేమ‌ని కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్టం చేసింది. దీదీతో పొత్తు చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొంది. ఇక అంత‌కుముందు రాహుల్ గాంధీ సైతం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌కు అత్యంత స‌న్నిహితురాల‌ని లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్‌లో టీఎంసీతో క‌లిసి పోటీ చేస్తామ‌ని, ఈ దిశ‌గా పొత్తు చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని అన్నారు.

అయితే బెంగాల్‌లో కాంగ్రెస్ దీదీ సహ‌కారం లేకుండా స్వ‌తంత్రంగా పోటీ చేయాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. అవ‌కాశ‌వాది అయిన మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీతో క‌లిసేది లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అధిర్ రంజ‌న్ వ్యాఖ్య‌ల‌ను మీడియా ప్ర‌స్తావించ‌గా వాటిని ప‌ట్టించుకోబోమ‌ని అన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి షాక్‌ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు.మరోవైపు రాహుల్‌ యాత్ర పై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్‌ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్‌ యాత్ర సాగనుంది.. అయినా మాకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.