అమెరికా లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలుగువాళ్లు మృతి

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు కన్నుమూశారు. వీరిలో ఏపీకి చెందిన ఓ యువకుడు, తెలంగాణకు చెందిన ఓ యువకుడు, యువతి ఉన్నారు. ప్రమాదంలో మరో నలుగురు తెలుగువాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితులందరూ కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకంది. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాను, ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

చనిపోయిన వారి వివరాలు చూస్తే..తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్‌ కుమారుడు సాయి నరసింహ (23) , ప్రేమ్‌ కుమార్‌ రెడ్డి (హైదరాబాద్), పావని (వరంగల్‌) మరికొందరు మిత్రులు కలిసి మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో సాయి నరసింహ, పావని, ప్రేమ్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.