చందానగర్‌లో కల్తీ ఐస్‌క్రీమ్‌ల గుట్టురట్టు

ఈరోజుల్లో కల్తీ లేనిది ఏది ఉండడం లేదు..తినే బియ్యం దగ్గరి నుండి తాగే పాల వరకు అన్నింట్లో కల్తీ ఉంటుంది. తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్‌లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన కెమికల్స్ ఉపయోగించి నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తూ మోసం చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఐస్‌క్రీమ్‌లతో పాటు ఫ్లేవర్స్, బ్రాండెండ్ కంపెనీల స్టిక్కర్లను సీజ్ చేసి , నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

గురువారం నకిలీ చాక్లెట్స్, లాలిపప్స్ తయారుచేస్తున్న ముఠా పట్టబడింది. అత్యంత ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను వాడి నకిలీ చాక్లెట్లతో పాటు లాలీపాప్లను తయారుచేస్తున్నారు. అనంతరం మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. అది మరువకముందే ఇప్పుడు కల్తీ ఐస్‌క్రీమ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఐస్‌క్రీమ్‌లను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేపట్టారు. ఐస్‌క్రీముల టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ఉపయోగిస్తున్నారని, ఆ విధంగా తయారుచేసిన వాటికి బ్రాండెడ్ స్టికరింగ్ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. శుభకార్యాలకు కూడా ఈ నకిలీ ఐస్‌క్రీమ్‌లను సరఫరా చేస్తున్నారని, ఐదు సంత్సరాలుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.