గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామా లేఖ‌ను సమర్పించిన య‌డియూర‌ప్ప‌

య‌డియూర‌ప్ప రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం..

బెంగ‌ళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్‌ కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. యడియూర‌ప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని ఆయన సూచించారు.

మరోపక్క, క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి పేరును బీజేపీ అధిష్ఠానం ఖ‌రారు చేయ‌నుంది. ఇందుకోసం రేపు ఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కానుంది. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని ఇటీవ‌ల ఊహాగానాలు వచ్చాయి. చివరికి అవి నిజ‌మ‌వుతున్నాయి. య‌డియూర‌ప్ప‌ క‌ర్ణాట‌క‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. రెండేళ్ల క్రితం క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలాక ఆయ‌న సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

నేటితో ఆయ‌న ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. య‌డియూర‌ప్ప‌కు 78 ఏళ్లు కావ‌డం, ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం వంటి అంశాలు ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారు ప‌ద‌వుల్లో ఉండ‌డానికి వీల్లేద‌ని బీజేపీ నియ‌మాలు పాటిస్తోంది. సీఎం ప‌దవికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ పార్టీ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాన‌ని య‌డియూర‌ప్ప అన్నారు.

ఇదిలావుంచితే, క‌ర్ణాట‌క‌లో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తార‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశంలో జ‌రిగే త‌దుప‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/