తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఇంట్లో విషాద ఛాయలు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తల్లి మీనాక్షిసింగ్ (85) సోమవారం రాత్రి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత మూడువారాలుగా అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. సోమవారం రాత్రికి ఆరోగ్యం విషమించడం తో తుదిశ్వాస విడిచారు.
మీనాక్షిసింగ్ పార్థివదేహానికి మంగళవారం బిహార్ రాష్ట్రం పట్నాలోని తమ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మీనాక్షి సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సోమేష్ కుమార్‌ను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. ఏఐజీ ఆస్పత్రిలో సోమేశ్ కుమార్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పరామర్శించారు. మీనాక్షిసింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీనివాస్ గౌడ్ ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.