సీఈసీతో ముగిసిన చంద్రబాబు – పవన్ సమావేశం

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఓటరు జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీతో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

టీడీపీ, జనసేనలకు సీఈసీ 15నిమిషాలు సమయం కేటాయించగా.. అరగంట పాటు సవివరంగా తమ ఫిర్యాదు అంశాలను ఈసీ దగ్గర చంద్రబాబు, పవన్ వివరించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని చంద్రబాబు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రాజకీయ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పనిచేసుకోనివ్వని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేదిస్తోందని, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిపై సీఈసీకి వివరించామని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లు తొలగించడం సరికాదని చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారులను బెదిరింపులకు గురిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు.