రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..

మొన్నకి మొన్న సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మరవకముందే నేడు రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదామ్‌లో నిలిపివుంచిన రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. దీంతో మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తోన్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్లు సమాచారం.
నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే..గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు జీహెచ్ఎంసి అధికారులపై మండిపడుతున్నారు. ఇక గత కొద్దీ నెలలుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.