అమిత్ షా చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు..

Huge arrangements are going on for Amit Shah’s Chevella Sabha.

హైదరాబాద్‌ః తెలంగాణ బిజెపి రేపు చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బిజెపి నాయకులు.. జనసమీకరణపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ సభను సక్సెస్ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే చేవేళ్లలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. దగ్గరుండి పార్టీ నేతలు సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. చేవేళ్లకు వెళ్లే దాదాపు అన్ని రహదారుల గుండా బిజెపి నాయకులు తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ చూసినా బిజెపి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సభను సక్సెస్ చేసి, కార్యకర్తల్లో జోష్ నింపాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, పార్లమెంటరీ ప్రవాస్ యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బిజెపి నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. మూడు రోజులుగా సభ ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు మునిగారు. ఏప్రిల్ 20 బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి వేదిక దగ్గరగా ఉండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు.