దేవరగట్టు కర్రల సమరం.. పదుల సంఖ్యలో గాయపడ్డారు

కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన కర్రల సమరంలో 50 మంది గాయపడ్డారు. కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు మృతి చెందాడు. ప్రతి ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా ఈ కర్రల సమరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వర్షం కారణంగా కర్రల సమరం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన కర్రల సమరంలో 50 మంది భక్తులు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలాసేపటి వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వారిని వెంటనే వారికి మెరుగైన వైద్యం అందించారు.

అలాగే కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు సైతం మృతి చెందినట్లు తెలుస్తుంది. అతడిని కర్ణాటకలోని శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిగా గుర్తించారు. గుండెపోటుతోనే అతడు మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్రల సమరంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఇంకోవైపు ఉండి కర్రలతో తలపడతారు. స్వామి వారి మూర్తులను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు కర్రలతో హోరాహోరీగా తలపడతాయి. ఏళ్లుగా వస్తున్న ఆచారమిది.