హైదరాబాద్‌లో కాల్పులు కలకలం

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల మోత మోగాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలోని ఓ హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న దేవేందర్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి దండుగుడు పరారయ్యారు. బుధవారం రాత్రి 9:40 గంటలకు దేవేందర్‌ హోటల్ నుంచి బయటకు రాగానే హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు.

దేవేందర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దేవేందర్ కోల్ కత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత 6 నెలలుగా అతడు ఈ హోటల్ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లే టైమ్ లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతడిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, కంట్రీ మేడ్ పిస్టల్ ను దుండగులు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.