పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మంది భక్తులకు గాయాలు

stampede-like-situation-erupted-in-puri-srimandir

కటక్‌ః ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ శ్రీమందిర్‌ లో ‘మంగళ ఆలతి’ సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒడిశాలో గత పౌర్ణమి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని నేడు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆలయంలో ‘మంగళ ఆలతి’ నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోకి నెట్టుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ పూరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.