సీనియర్ ఎన్టీఆర్ తో పవన్ కళ్యాణ్ ను పోల్చిన రైటర్ గోపాల కృష్ణ

అన్నగారు (సీనియర్ ఎన్టీఆర్ ) ఎన్టీఆర్..పవన్ కళ్యాణ్ ల ఆశయం ఒక్కటే అన్నారు ప్రముఖ రైటర్ గోపాల కృష్ణ. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి స్పందించారు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక పార్టీలో ఉండి.. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచన వేరు.. సమాజాన్ని మార్చాలనే ఆశయం వేరు. ఆ ఆశయం పవన్‌లో ఉంది. అన్నగారు (ఎన్టీఆర్‌) మాదిరిగా ఈయన ఆశయం కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలనే. ఎన్నికల్లో నిలబడగానే గెలుస్తాం, ముఖ్యమంత్రులమైపోతాం అనేది తర్వాత విషయం. మన మాట సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.

ఈ సమాజాన్ని బాగుచేయడానికి మన వంతు కృషి చేయాలి అనే ఆలోచన గొప్పది. అదే విషయాన్ని పవన్‌ గత కొంత కాలంగా చెబుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా? రాకపోయినా తన పోరాటం తాను చేసుకుంటూ వెళ్లిపోయేవాడు వీరుడు. కాబట్టి అతడి వాయిస్‌ చట్టసభల ద్వారా వినిపించాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని అన్నారు. మనకన్నా ఆయనకే ప్రపంచం గురించి ఇంకా ఎక్కువగా తెలుసు అనేది నా అభిప్రాయం. ప్రశ్నించే హక్కును ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా రానున్నఎన్నికల్లో పొందాలని కోరుకుంటున్నాను అని పరుచూరి తెలిపారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.