నేడు పవార్, యశ్వంత్ సిన్హా నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీ!

బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాల ఏకీకరణే లక్ష్యం

న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీని టీఎంసీ మట్టికరిపించడం ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ నేటి సమావేశంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డి. రాజా సహా మొత్తం 15 మంది నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు యశ్వంత్ సిన్హా ఆహ్వాన లేఖలు పంపారు.

వీరితోపాటు మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషి, సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి, బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అఖ్తర్, ప్రీతీష్ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ వంటి వారు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు.

ఇక, ఈ నెల 11న ముంబైలో శరద్ పవార్‌ను కలిసి ప్రతిపక్షాల ఏకీకరణపై చర్చించిన ప్రశాంత్‌ కిశోర్ నిన్న మరోమారు పవార్‌ను కలిసి చర్చించారు. దాదాపు గంటన్నరపాటు చర్చించారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాయన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/