టీఎస్ పీఎస్సీ సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్‌పై విచారణ వాయిదా: హైకోర్టు

వాదనలకు సమయం కావాలని కోరడంతో మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి

High Court of Talangana
High Court of Talangana

హైదరాబాద్‌ః తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్ వైజర్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షతో పాటు ఇతర నియామక పరీక్షలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే సీడీపీవో, ఈవో పరీక్షల నిర్వహణపైనా సందేహాలు ఉన్నాయని, వాటిని కూడా రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు 76 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషన్ దారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.