తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆహ్వానించిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ

విశాఖ ఉక్కు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆహ్వానించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వెంటనే విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది విశాఖ ఉక్కు పోరాట కమిటీ. తెలంగాణ ప్రభుత్వ అధికారులు వస్తే భారీ ర్యాలీగా ఘనంగా స్వాగతించి తీసుకుని వెళతామని పేర్కొంది. ప్రజల అస్థిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలన్న కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన జెఏసీ….బహిరంగ సభను నిర్వహించేందుకు మేం సిద్ధం అని పేర్కొంది.

ఇక తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల బహిరంగంగానే విమర్శించారు. బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు.

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే ఏపీలోని ఉత్తారాంధ్రపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.