హైదరాబాద్‌లోనూ తలెత్తిన హిజాబ్ వివాదం..హోం మంత్రికి ఫిర్యాదు

నగరంలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం

students-protest-at-kv-rangareddy-womens-degree-college-after-not-being-allowed-attend-exam-wearing-hijab

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం తలెత్తింది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్‌ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. చివరకు కొందరు హిజాబ్ తీసేసి పరీక్షకు హాజరైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా వారిని హిజాబ్‌తోనే పరీక్షకు అనుమతించినట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా తాము అరగంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభించామని విద్యార్థినులు చెప్పారు. తదుపరి పరీక్షకు హిజాబ్ లేకుండా రావాలని కూడా సిబ్బంది ఆదేశించారని అన్నారు. మరోవైపు, ఈ వార్తలను కాలేజీ యాజమాన్యం ఖండించింది. హిజాబ్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని కూడా విద్యార్థినుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.