కేసీఆర్ దేశ పర్యటన ఫై రేవంత్ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. దసరా రోజున కేసీఆర్ పార్టీ ప్రకటన చేయబోతారని తెలుస్తుంది. జాతీయ పార్టీ ప్రకటన వెంటనే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానాన్నే కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో, 12 సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్య నేతలతో చర్చలకు, విశ్రాంతి తీసుకునేందుకు, మీడియా ప్రతినిధులకు విమానంలోనే ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఈ ఫ్లైట్‌లో ప్రత్యేక ఏర్పా్ట్లు ఉంటాయని అంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొనుగోలు చేస్తున్న ఈ విమానానికి విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ విమానం కోసం రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘అప్పుడేమో ఫాంహౌస్ దాటింది లేదు.. ఇప్పుడేమో దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట!’ అంటూ రేవంత్ సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. ఇన్నేళ్ల తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలను ఏ రోజూ కలవలేదని.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడూ పరామర్శించలేదు అంటూ విమర్శించారు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు.. ఫాంహౌస్ దాటింది లేదు, ఇప్పుడేమో దేశ దిమ్శరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..!! అంటూ రేవంత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.