విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీకాంత్

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. యువకుల దగ్గరి నుండి పెద్ద వారి వరకు అంత సోషల్ మీడియా తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో చాలామంది ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తూ అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు. బ్రతికున్న వారిని చంపేస్తూ..లేనిపోని వార్తలను ప్రచారం చేస్తూ వస్తున్నారు. ముఖ్యముగా చిత్రసీమ నటి నటులకు సంబంధించి అనేక వార్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు నిజం ఏంటో వారే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్ తన భార్య ఊహ కు విడాకులు ఇవ్వబోతున్నారంటూ కొంతమంది యూట్యూబ్ లలో , సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు చూసి చాలామంది నిజమేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ వార్తల ఫై హీరో శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. “ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు.. ఆందోళన పడవద్దు’ అని తనను ఓదార్చాను” అని చెప్పారు.

”అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్ మరియు యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే.. వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది”

”ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్ – యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రకటన రిలీజ్ చేసారు. శ్రీకాంత్ – ఊహ.. ప్రేమించుకొని 1997లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. వీరికి రోషన్ – రోహన్ అనే ఇద్దరు కుమారులతో పాటుగా.. మేధ అనే కుమార్తె కూడా ఉంది.