జులై 11కు వాయిదా పడిన అమరావతి కేసుపై విచారణ

అమరావతి కేసు విచారణను సుప్రీం కోర్ట్ జులై 11 కు వాయిదా వేసింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

అయితే ఇంకా ముందే విచారణ చేపట్టి కేసును త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ సహా ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కనీసం ఏప్రిల్ నెలలోనైనా చేపట్టాలని పదే పదే కోరారు. అయినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు. “ఎందుకంత తొంద‌ర ప‌డుతున్నారు? దానిలో మీ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాలు లేవుక‌దా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదుల‌ను ప్రశ్నించింది కోర్ట్.

జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో మంగళవారం అమరావతి కేసుకు ఉంది. వరుస క్రమంలో 10వ స్థానంలో ఉన్నప్పటికీ, విచారణకు వచ్చేసరికి సాయత్రం గం. 4.00 దాటింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ కేసు విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరగా.. కోర్టు పద్ధతులు పాటించాలని, వరుస క్రమంలో కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తులు సున్నితంగా వారించారు. సాయంత్రం విచారణ చేపట్టే సమయానికి కోర్టు సమయం దాదాపుగా ముగిసిపోయంది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ తేదీని జులై 11గా ధర్మాసనం ఖరారు చేసింది.