కరోనా పరిస్థితిపై లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే..

health-minister-statement-in-parliament-on-covid-19-situation

న్యూఢిల్లీః కరోనా కొత్త వేరియంట్‌పై లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ కీలక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్‌ BF-7పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ కచ్చితంగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కొత్త కరోనా వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని.. కరోనా ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉందన్నారాయన. చైనాలో కేసుల పెరుగుదల ప్రపంచానికి హెచ్చరికలాంటిదన్నారు మాండవీయ. సిట్యువేషన్ ముందు ముందు మరింత ఘోరంగా మారే అవకాశాలు ఉన్నాయన్న ఆరోగ్య నిపుణుల సూచనలను అందరూ అర్థం చేసుకోవాలన్నారు. చాలా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారాయన. మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సన్నద్దంగా ఉందన్నారు మాండవీయ.

కాగా, దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులకు ర్యాండమ్‌గా ఆర్టీ పీసీఆర్‌ నమూనాలను సేకరిస్తున్నామన్న ఆయన.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కొవిడ్‌ పరిస్థితిని నిర్వహించడంలో ఆరోగ్యశాఖ చురుగ్గా పని చేస్తుందని, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 220 కోట్ల డోసులు వేశామని, పండుగ సీజన్‌, న్యూ ఇయర్‌ నేపథ్యంలో ప్రజలు మాస్క్‌లు ధరించేలా చూసుకోవాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, బూస్టర్‌ డోస్‌పై అవగాహన కల్పించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలకు సూచించినట్లు వివరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/