పార్టీలో నా పాత్ర ఏంటన్నది ఆయన నిర్ణయిస్తారు: రాహుల్ గాంధీ

వెళ్లి ఖర్గేజీ ని అడగండన్న రాహుల్

rahul-gandhi-opines-that-india-will-progress-when-women-are-safe

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతరుడు మల్లికార్జున ఖర్గే విజయం సాధించడంతో.. గాంధీ వారసుడు, యువ నేత రాహుల్ గాంధీ పాత్ర ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు రానుండడంతో ఇకపై మీరు ఏం చేయబోతున్నారంటూ విలేఖరులు రాహుల్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన వెళ్లి ఖర్గేజీని అడగాలని సూచించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోకి కర్నూలు జిల్లా పరిధిలో పాద యాత్ర చేస్తున్న రాహుల్ ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే ఆయన ఖర్గేని అడగాలని సూచించడం గమనార్హం.

‘‘కాంగ్రెస్ అధ్యక్షుడే పార్టీకి సుప్రీమ్. ప్రతి సభ్యుడు ఆయనకు రిపోర్ట్ చేయాల్సిందే. పార్టీలో నా పాత్ర ఏంటన్నది ఆయన నిర్ణయిస్తారు. దయచేసి ఖర్గేజీ, సోనియా గాంధీజీని అడగండి’’అంటూ రాహుల్ బదులిచ్చారు. పార్టీ ఎన్నికలపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు.

‘‘ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ లో ఎన్నికల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ స్వేచ్ఛా యుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం పట్ల నేను గర్విస్తున్నాను. బీజేపీ తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఎన్నికల పట్ల (అధ్యక్ష స్థానానికి) ఆసక్తి చూపించడం లేదు’’అని రాహుల్ ప్రశ్నించారు.