రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు క‌రెంట్ షాకివ్వాలి – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రేవంత్ దిష్టిబొమ్మలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని నిప్పులు చెరిగారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడాని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని హ‌రీశ్‌రావు రైతుల‌కు సూచించారు.

మరో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సైతం రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ‌ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత‌ కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. కేసీఆర్‌ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌గొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ , టీడీపీ పాల‌న‌లో క‌రెంట్ లేక రైతులు అరిగోస ప‌డ్డార‌ని, స్వ‌రాష్ట్రంలో పుష్క‌లంగా సాగునీరు, నాణ్య‌మైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలను ప్ర‌జ‌లు తిప్పికొడ‌తార‌ని హెచ్చ‌రించారు.

మొద‌టి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్నచూప‌ని, మొన్న ధ‌ర‌ణి వ‌ద్ద‌న్నార‌ని, ఇప్పుడు వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిపోతుంద‌ని చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే.. కాంగ్రెస్ రైతు వ్య‌తిరేఖ పార్టీ అని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.