తల్లి మనసుతో ఆలోచించి న్యూట్రిషన్‌ కిట్ ను అందిస్తున్నాం – మంత్రి హరీష్ రావు

తల్లి మనసుతో ఆలోచించి న్యూట్రిషన్‌ కిట్ ను అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. బుధువారం కామారెడ్డి నుంచి వర్చువల్‌గా మంత్రి హరీశ్‌రావు ఈ కిట్ల పంపిణీని ప్రారంభించారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కిట్‌ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు.

అలాగే తెలంగాణలో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డను అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మనం తీసుకునే ఆహార నియమాల వల్లే జీవన విధానంలో మార్పులు వస్తుంటాయని చెప్పారు. దేశానికి ఆదర్శం ఈ పథకమని చెప్పారు. బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్న ప్రభుత్వం, తల్లి సంరక్షణ కోసం కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్ ప‌థ‌కం ప్రవేశ‌పెట్టింద‌ని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు.

ప్రాథమికంగా తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో ముందుగా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ప్రవేశపెట్టింది.

ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నది. 16 నుంచి 24వారాలు ( రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు కిట్‌కు అర్హులని అధికారులు పేర్కొన్నారు. న్యూట్రిషన్‌ కిట్ల కోసం రూ.50కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఒక్కో కిట్‌ రూ.2 వేల వరకు ఉంటుంది. ఇక ఈ కిట్ లో ఆరకిలో నెయ్యి, కిలో ఖర్జూర పండ్లు ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్‌ బాటిల్స్‌, ఇతర పోషక పదార్థాలు ఉండనున్నాయి.