మునుగోడు లో దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది – మంత్రి హరీష్ రావు

మునుగోడు ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడి దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని.. నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాకుండా కార్లు మోటర్ సైకిళ్ళు గిఫ్ట్‌గా ఇస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు ప్రచారంలో బిజీ అయ్యారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు , ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఆదివారం టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మునుగోడులో ప్రజలు గెలవాలా..? రాజగోపాల్‌ రెడ్డి ధనం గెలవాలా..? అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మునుగోడులో బిజెపి నేతలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా.. నేతలను కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్రపూజలంటూ మాట్లాడటం దారుణమన్న ఆయన.. తాంత్రిక విద్యలపై కోర్సులు పెట్టింది బిజెపినే అని మండిపడ్డారు. టిఆర్ఎస్ దగ్గర ఉన్నవి లోక్‌ తాంత్రిక విద్యలు అని పేర్కొన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడి దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాకుండా కార్లు మోటర్ సైకిళ్ళు గిఫ్ట్‌గా ఇస్తున్నారన్నారు. ఇప్పటికే మునుగోడులో పంచేందుకు 200 బ్రెజ్జా కార్లు, 2000 మోటర్ సైకిళ్ళు బుక్ చేసినట్లు తెలిసిందని ఆరోపించారు. మండలాలవారీగా ఓటర్లకు పంచుతున్న కార్లు, బైకుల లిస్టును ఎన్నికల కమిషన్‌కు ఇస్తామని చెప్పారు. ఇవ్వాళ కార్లు, మోటర్‌ సైకిళ్లు కొనిచ్చిన బీజేపీ నేతలు.. రేపు మోటర్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి గతంలో అన్నాడని, మునుగోడు ప్రజలు మోటర్లకు మీటర్లు కావాలో.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే తపించే టీఆర్‌ఎస్‌ కావాలో తేల్చుకోవాలని హరీష్‌రావు సూచించారు.