కేసీఆర్ రైతుల ఉసురు తీస్తున్నారంటూ షర్మిల ఫైర్

ధరణి పేరు చెప్పి కేసీఆర్ రికార్డ్​లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 174వ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ తాడ్వాల్ మండలం కృష్ణాజివాడ గ్రామంలో మొదలైంది. అక్కడి నుంచి బ్రహ్మాజీ వాడ, దేవాయిపల్లి, తాడువాయి గ్రామాల మీదుగా సాగుతోంది. సాయంత్రం లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో మాటా ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ ఫై విమర్శల వర్షం కురిపించింది.

తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే సమస్యను ధరణి తెచ్చి రైతులు కలెక్టర్ దాకా వెళ్లేలా చేశారని, ధరణి పేరు చెప్పి రికార్డ్​లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అయినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు లేకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని సూచించారు. కెసిఆర్ పాలనలో ప్రతి పథకం మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ సంక్షేమ పథకాలను తెలంగాణలో ఆపేసారని మండిపడ్డారు.