ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతుంది మీ ‘వార్త’. గత ఏడాది కరోనా కారణంగా చవితి సంబరాలు జరుపుకోలేకపోయాం. కానీ ఈసారి ఊరు, వాడ , పల్లె , పట్టణం ఇలా అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నవరాత్రి సంబరాలు జరుపుకునేందుకు సిద్దమయ్యాం. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ముందుగానే చవితి సంబరాలు మొదలయాయ్యి. గణేష్ విగ్రహాలు తీసుకరావడం, మండపాలను సిద్ధం చేయడం వంటి పనుల్లో అంత నిమగ్నమయ్యారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక వినాయక చవితి విశిష్టత…ఎందుకు జరుపుకుంటాం..పూజా వివరాలు ఏంటి..అనేవి తెలుసుకుందాం.

వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒకటి. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

విఘ్నేశ్వరుని కథ :

పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘భక్తా! నీ కోరికేమి?’ అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి’ అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, ‘ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది’ అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.

శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు ‘మీకేం కావాలో కోరుకోండి!’ అనగా, విష్ణుమూర్తి ‘ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి’ అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో ‘నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని’ వేడుకొన్నాడు. అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి ‘ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.

ఇక వినాయకుడి జననం గురించి తెలుసుకుంటే..

కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల ‘గజాననుడు’గా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు.

ఇక వినాయకుడి నిమజ్జనం విషయానికి వస్తే..భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.