సొంత చెల్లెకు న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్రానికి ఏం చేస్తారని లోకేష్ ధ్వజం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటన ఉద్రక్తతకు దారి తీసింది. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోకేష్ రాగా..కరోనా నేపథ్యంలో లోకేష్ పర్యటన కు పోలీసులు అనుమతి నిరాకరించారు. గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుని, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండవల్లిలోని నివాసానికి తరలించారు.

ఈ క్రమంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ..జగన్‌ పాలనలో సొంతింట్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. సొంత చెల్లెకు న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్రానికి ఏం చేస్తారని లోకేశ్‌ ధ్వజమెత్తారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.. కానీ, 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడట్లేదు.. తాడేపల్లి, పులివెందుల సహా ఎక్కడా మహిళలకు భద్రత లేదు.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.. జగన్‌ నివాసం సమీపంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయి.. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్తుంటే అంత భయమెందుకు?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.