ఇతర రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు : జీవీఎల్ నరసింహారావు

కేంద్రం నిధులతో పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటున్నారు

అమరావతి : కేంద్రం ప్రభుత్వం ఏపీకి చేసింది ఏముందని వైస్సార్సీపీ నేతలు ప్రశ్నించడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తప్పుపట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ ఇచ్చామని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం 20 నెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసిందని చెప్పారు. గత ఆరేళ్లలో రూ. 24 వేల కోట్లను ఆహార సబ్సిడీ కింద ఇచ్చామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే విషయంపై వైస్సార్సీపీ నేతలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతాయని చెప్పారు. వైస్సార్సీపీ, టీడీపీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్య పెడుతున్నాయని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/