కాంగ్రెస్ లోకి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..?

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఆయనను కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని గుత్తాను కోరారు. కాగా తొలుత సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు టాక్. ఇదే జరిగితే నాంగొండ జిల్లాలో బిఆర్ఎస్ కు భారీ దెబ్బ పడనుంది. ఇప్పటికే బిఆర్ఎస్ కు వరుసగా నేతలు షాక్ ఇస్తూ వస్తున్నారు. ఓడిన నేతలే కాదు గెలిచినా నేతలు కూడా కాంగ్రెస్ లోకి పలువురు వెళ్లారు. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వెళ్తే ఎలా అని బిఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో, ఆ తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్ లో పనిచేశాడు. సుఖేందర్‌రెడ్డి 2004 పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి నుంచి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచి 2016, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018, మార్చిలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనను రైతు స‌మ‌న్వయ స‌మితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాడు. 2018, మార్చి 12వ తేదిన రాష్ట్ర రైతు స‌మ‌న్వయ స‌మితి చైర్మన్‌గా ఆయన ప్రమాణాస్వీకారం చేశాడు. 2019 ఆగస్టులో శాసనమండలికి ఎమ్మెల్యే కోటా నుండి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై, 2019 సెప్టెంబరు 11న బాధ్యతలు చేపట్టాడు. 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది.

గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 2021 నవంబరు 16న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా మార్చి 13న నామినేష‌న్ దాఖలు చేశాడు. మండ‌లి ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో చైర్మ‌న్‌గా మార్చి 14న ఏక‌గ్రీవంగా ఎన్నికై రెండోసారి బాధ్యతలు చేపట్టాడు.