గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఫై ఎస్పీ వివరణ

గుంటూరు లో టీడీపీ చేపట్టిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్ లో తొక్కిసలాట జరగడం తో ముగ్గురు మహిళలు కన్నుమూయగా..మరికొంతమంది మహిళలు గాయపడ్డారు. ఈ ఘటన పట్ల గుంటూరు ఎస్పీ వివరణ ఇచ్చారు. పంపిణీ సభలో ఏర్పాటు చేసిన తొలి కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడడంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తాము నిర్వాహకులకు చెప్పామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి అటువంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. మృతుల్లో ఇద్దరి పేర్లు రమాదేవి, అసియాగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. గాయపడ్డ మహిళలకు ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. కొందరిని పోలీసులు కాపాడినట్లు తెలుస్తోంది. కానుకలు ఇస్తారని వస్తే తమ కుటుంబాల్లో పెను విషాదం మిగిలిందని పలువురు మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.