బిఆర్ఎస్ లోకి జనసేన నేత..ఏపీలో మొదలైన వలసలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్..అన్ని రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకెళ్లే పనిలో బిజీ గా ఉన్నారు. ఇక ఏపీలోను పార్టీ ప్రభావాన్ని చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గట్లే ఇప్పటి నుండే కీలక నేతలను బిఆర్ఎస్ లోకి చేర్చుకొని పని పెట్టుకున్నారు. తాజాగా జనసేన పార్టీ కీలక నేత తోట చంద్రశేఖర్.. రేపు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈయన బిఆర్ఎస్ లో చేరనున్నారు.

ఇందుకోసం రేపు 200 వాహనాలతో తెలంగాణ భవన్ కు ర్యాలీగా చేరుకోనున్నారు. నర్సాపురం నుంచి కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నట్లుగా సమాచారం. తోట చంద్రశేఖర్ తో పాటు మాజీమంత్రి రావెల కిషోర్ బాబు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా వినికిడి. ఏపీతో పాటు 6 రాష్ట్రాల్లో తొలుత బీఆర్ఎస్ శాఖలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఏపీపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.